ఏపీ రాజకీయాల్లో షర్మిల ప్రభావం కచ్చితంగా ఉంటుంది: బ్రదర్ అనిల్ కుమార్

  • కాంగ్రెస్ హైకమాండ్ ఏ బాధ్యతలను అప్పగించినా షర్మిల స్వీకరిస్తారన్న అనిల్
  • కాంగ్రెస్ కుటుంబంలో ఉండటమే తమకు ముఖ్యమని వ్యాఖ్య
  • హైకమాండ్ ఆదేశాల మేరకు షర్మిల పూర్తి స్థాయిలో పని చేస్తారన్న అనిల్
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల సమక్షంలో ఆమె కాంగ్రెస్ లో చేరారు. షర్మిలకు రాహుల్, ఖర్గేలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ కూడా హాజరయ్యారు. షర్మిల పక్కనే ఆయన వేదికపై ఉన్నారు. ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో బ్రదర్ అనిల్ మాట్లాడుతూ... కాంగ్రెస్ కుటుంబంలో తాము కూడా సభ్యులమే అని చెప్పారు. ఈ దేశానికి మంచి జరుగుతుందని అన్నారు. 

పార్టీ హైకమాండ్ ఏ బాధ్యతలను అప్పగించినా షర్మిల స్వీకరిస్తారని... కాంగ్రెస్ కుటుంబంలో ఉండటమే తమకు ముఖ్యమని చెప్పారు. కాంగ్రెస్ లో షర్మిల చేరడం ఏపీ రాజకీయాల్లో ప్రభావం చూపుతుందా? అనే ప్రశ్నకు సమాధానంగా... ఏపీలో కచ్చితంగా షర్మిల ప్రభావం ఉంటుందని అన్నారు. మీ బావమరిది, సీఎం జగన్ కు వ్యతిరేకంగా పని చేయమని హైకమాండ్ ఆదేశిస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా... అధిష్ఠానం ఆదేశాల మేరకు షర్మిల పూర్తి స్థాయిలో పని చేస్తారని చెప్పారు.

Brother Anil Kumar
YS Sharmila
Congress

More Telugu News